Wednesday, 23 April 2025 01:00:04 AM

ట్రయిల్ కోర్టుల తీరుపై సుప్రీం కోర్టు అసహనం.. ప్రజాస్వామ్యదేశం పోలీసుల రాజ్యంలా పనిచేయకూడదని హితవు

బెయిల్ పిటిషన్లను తిరస్కరించడాన్ని తప్పు బట్టిన అత్యున్నత న్యాయస్థానం..

Date : 19 March 2025 06:29 AM Views : 168

ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / : ట్రయిల్ కోర్టుల తీరుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. చాలా సాధారణ కేసుల్లో దర్యాప్తు పూర్తయినప్పటికీ బెయిల్ పిటిషన్లను తిరస్కరించడాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పు బట్టింది. ప్రజాస్వామ్యదేశం పోలీసుల రాజ్యంలా పనిచేయకూడదని హితవు పలికింది. ఒక చిన్న కేసులో బెయిల్ కోసం దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. “ ఒక ప్రజాస్వామ్య దేశం పోలీసుల రాజ్యంలా పనిచేయకూడదు. ఇక్కడ నిజాలతో సంబంధం లేకుండా చట్టం అమలు చేసే సంస్థలు , కొందరు వ్యక్తులను నిర్బంధించేందుకు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తారు.అలా చేయడం ఆమోద యోగ్యం కాదు. రెండు దశాబ్దాల క్రితం , చిన్న కేసుల్లో బెయిల్ పిటిషన్లు హైకోర్టు, సుప్రీం కోర్టులకు చాలా అరుదుగా వచ్చేవి.ట్రయిల్ కోర్టు స్థాయిలో పరిష్కారం కావాల్సిన కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్ల విషయంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడమనేది దిగ్భ్రాంతి కలిగిస్తోంది. అనవసరంగా వ్యవస్థపై భారం పడుతోంది.” అని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా , జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఒక చిన్న కేసులో రెండేళ్లకు పైగా కస్టడీలో ఉన్న నిందితుడికి బెంచ్ బెయిల్ మంజూరు చేసింది.దర్యాప్తు పూర్తయి ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ, నిందితుడికి బెయిల్ పిటిషన్‌ను ట్రయిల్ కోర్టు , గుజరాత్ హైకోర్టు తిరస్కరించాయి. మేజిస్ట్రేట్లు విచారించ గలిగే కేసుల్లో బెయిల్ విషయాలను సుప్రీం కోర్టు ముందుకు తీసుకురావడం దురదృష్టకరమని అభయ్ ఎస్ ఓకా అసహనం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు ఈ అంశాన్ని గురించి ప్రస్తావించడం ఇదే తొలిసారి కాదు. చిన్న చిన్న నేరాలకు సంబంధించిన కేసుల్లోను బెయిల్ మంజూరు చేయడంలో ట్రయల్ కోర్టులు, హైకోర్టులు మరింత ఉదారవాద వైఖరితో వ్యవహరించాలని సూచించింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :