ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / : మహాకుంభమేళ విజయవంతం కావడంపై ప్రధాని మోదీ స్పందించారు కానీ.. తొక్కిసలాట ఘటనలో మరణించిన వారికి ఆయన నివాళులర్పించ లేదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మంగళవారం లోక్ సభలో వెలుపల ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రయాగ్ రాజ్ వేదికగా నిర్వహించిన మహాకుంభమేళ విజయవంతం కావడంపై ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారని చెప్పారు. కానీ ఈ ప్రయాగ్ రాజ్‌లో జరిగిన తొక్కిసలాటలో పలువురు మరణించారని... వారికి ప్రధాని మోదీ నివాళులర్పించలేదని చెప్పారు.కుంభమేళా అంటే.. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయమని రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఆ క్రమంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలతో తాము పూర్తిగా ఏకభవీస్తామన్నారు. కానీ తొక్కిసలాట ఘటనలో మరణించిన వారికి ఘన నివాళులర్పించక పోవడం పట్ల ఆయన తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే ఈ కుంభమేళ కారణంగా తమకు ఉపాధి లభిస్తోందని యువత ఆశించిదని చెప్పారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లారన్నారు. అయితే మనది ప్రజాస్వామ్య దేశమని.. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడికి సభలో మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు. కానీ తనకు సభలో మాట్లాడే అవకాశం మాత్రం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు దాదాపు 45 రోజుల పాటు ప్రయాగ్ రాజ్‌లో మహాకుంభమేళ నిర్వహించారు. ఈ మహాకుంభమేళలో పవిత్ర స్నానమాచరించేందుకు దేశవిదేశాల నుంచి కోట్లాది మంది ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు. అలా దాదాపు 60 కోట్ల మందికి పైగా భక్తులు గంగానదిలో పవిత్ర స్నానమాచరించారు.ఈ నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాలు ఇటీవల ప్రారంభమైనాయి. దీంతో మంగళవారం లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. మహాకుంభమేళ విజయవంతమైందన్నారు. అందుకు యూపీ ప్రజలతోపాటు ప్రభుత్వాన్ని ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారత్ అంటే ఏమిటనేది ఈ మహాకుంభమేళ ద్వారా మరోసారి ప్రపంచానికి నిరూపితమైందన్నారు.జనవరి 29వ తేదీన మౌని అమావాస్య. ఈ నేపథ్యంలో కోట్లాది మంది ప్రజలు పుణ్య స్నానమాచరించేందుకు ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు. ఆ క్రమంలో తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు భక్తులు మరణించగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే దేశ రాజధాని న్యూఢిల్లీలో సైతం మహాకుంభమేళలో పాల్గొనేందుకు ప్రయాగ్ రాజ్ రైల్వే స్టేషన్‌కు భారీగా భక్తులు చేరుకున్నారు. ఆ సమయంలో సైతం తొక్కిసలాట జరిగింది. ఆయా ఘటనల్లో మృతులకు ప్రధాని మోదీ ఘన నివాళులర్పించ లేదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు.
Admin
Aakanksha News