Thursday, 25 June 2026 08:16:43 PM

“నా భార్య గెలిస్తే ఐదేళ్లు ఉచితంగా కటింగ్–షేవింగ్...

ఎన్నికల రంగంలో విచిత్ర హామీతో హల్ చల్…

Date : 04 December 2025 07:35 PM Views : 1296

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో స్థానిక వార్డు సభ్య పదవికి జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు ఒక విచిత్ర హామీతో రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్నాయి. సాధారణంగా వార్డు ఎన్నికల్లో అభ్యర్థులు అభివృద్ధి, నీటి సదుపాయం, వీధి లైట్లు, డ్రైనేజీ వంటి పరిమిత సమస్యల పరిష్కారానికే హామీలు ఇస్తుంటారు.అయితే రఘోత్తంపల్లిలో పోటీ చేస్తున్న ఒక మహిళా అభ్యర్థి భర్త మాత్రం వినూత్నంగా, గ్రామస్థుల్ని ఆకర్షించేలా హామీ ఇస్తూ ఎన్నికల రంగంలో కొత్త చర్చకు తెరలేపారు. రఘోత్తంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్య పదవిపై పోటీ పెరిగింది. గ్రామంలో సాధారణంగా ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఓటర్లను ఒప్పించడానికి పలు విధానాలను అనుసరిస్తుంటారు. అయితే ఈసారి ప్రచారంలోకి వచ్చిన ఒక ప్రత్యేక హామీ గ్రామ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వార్డు నెంబర్‌లో పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థి భర్త, వృత్తిరీత్యా గిరిజన వర్గానికి చెందిన కటింగ్ మేస్త్రీ, ఓటర్లతో మాట్లాడుతూ తమ ఓటు తన భార్య అభ్యర్థిత్వానికి ఇచ్చితే గ్రామంలోని ప్రతి పురుషుడికి ఐదేళ్లపాటు పూర్తిగా ఉచితంగా కటింగ్, షేవింగ్ సేవలు అందిస్తానని ప్రకటించారు. గ్రామంలో ఉన్న చిన్న షాప్‌లో సుమారు 12 సంవత్సరాలుగా కటింగ్ షేవింగ్ చేస్తూ జీవనోపాధి పొందుతున్న ఆయన గ్రామంలో ఉన్న నా వార్డు ప్రజల సమస్యలు నాకు తెలుసు. నా భార్య గెలిస్తే వార్డును అభివృద్ధి చేస్తాం. అందరికీ అందుబాటులో ఉండేలా సేవలు చేస్తాం. నేను నా వృత్తి ద్వారా ఐదేళ్లు ఉచితంగా సేవలు అందించడం ద్వారా ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతాను అంటూ ప్రకటించారని స్థానికులు చెబుతున్నారు.

➡️ సోషల్ మీడియాలో వైరల్ అయిన హామీ...

ఈ హామీ గ్రామం దాటి మిగతా గ్రామాల్లోకి వెళ్లి తెగ చర్చనీయాంశమైంది. ఈ వినూత్న హామీపై యువత హర్షం వ్యక్తం చేస్తుండగా, పెద్దలు మాత్రం ఇది ఎన్నికల రాజకీయాల్లో కొత్త పోటీకి నాంది కావొచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా ఈ వీడియో క్లిప్, ఆడియో సందేశాలు వైరల్ అవుతూ నవ్వులు పూయిస్తున్నాయి. ఎన్నికల్లో ఇలాంటి హామీ మొదటిసారి వింటున్నాం. అభ్యర్థులు రోడ్లపై, నీటిపై హామీలు ఇవ్వడం సహజమే కానీ షేవింగ్–కటింగ్ ఉచితం అని ఎవరు చెబుతారు?” అంటూ యువతలో చర్చ సాగుతోంది. కొందరు సరదాగా “మా వార్డులో కూడా ఇలాంటి మేస్త్రీలు ఉంటే బాగుండేది” అంటూ జోకులేస్తున్నారు.

➡️ ప్రచార వాతావరణంలో నవ్వుల హోరు...

గ్రామంలో ప్రచారం వేడెక్కుతున్న వేళ, ఈ హామీ ప్రచార సభల్లో కూడా ప్రధాన చర్చగా మారింది. ప్రత్యర్థి అభ్యర్థుల ప్రచార బృందాలు కూడా ఈ విషయాన్ని చర్చిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం.ఇప్పటి ఎన్నికల్లో అభ్యర్థుల హామీలకు చాలా వైవిధ్యం వస్తోంది. గ్రామంలో చిన్న హామీలు పెద్ద వార్తలవుతున్నాయి. ఈ హామీ కూడా గ్రామం మొత్తం నవ్వుల్లో ముంచేసింది అన్నారు.దీనిపై గ్రామ పెద్దలు, సంఘ ప్రతినిధులు, యువజన సంఘాలు ఈ ఎన్నికలలో ఇలాంటి వినూత్న హామీలపై స్పందిస్తూ, గ్రామ అభివృద్ధి ప్రాధాన్యతను గుర్తు చేస్తున్నారు. కొందరు నైతిక దృష్టితో ఇలాంటి వ్యక్తిగత సేవలను హామీగా ప్రకటించడం సరికాదని అభిప్రాయ పడుతుండగా, మరికొందరు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సరదా హామీలు ఎన్నికలలో ఉత్సాహాన్ని పెంచుతాయని అభిప్రాయపడుతున్నారు. వెనువెంటనే ఇతర అభ్యర్థులు కూడా తమ తమ ప్రచారాన్ని బలపరుస్తూ, ఓటర్లను సంప్రదిస్తున్నారు. గ్రామంలోని మూడు వార్డుల్లో పోటీ బలంగా ఉండటంతో ప్రతి ఇంటి ముందు ప్రచార శబ్దాలు సందడి చేస్తున్నాయి. మైకులు, పోస్టర్లు, బ్యానర్లు గ్రామాన్ని పండుగ వాతావరణంలోకి తీసుకెళ్లాయి. ప్రస్తుతం గ్రామంలో ఎక్కువ చర్చ నడుస్తున్న విషయం ఒకటే—ఎవరు గెలుస్తారు? అన్నదికంటే ముందుగా “ఉచిత షేవింగ్– కటింగ్ నిజంగా ఐదేళ్లు చేస్తారా?”అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారుతుంది. దీంతో రఘోత్తంపల్లి గ్రామ వార్డు ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాయి. విచిత్రమైనా వినూత్నమైనా, ఈ హామీ వల్ల ప్రచారానికి రంగు చేరినట్టే. గ్రామ రాజకీయాలు ఎలా మారతాయో, ఓటర్లు ఈ హామీని ఎలా స్వీకరిస్తారో డిసెంబర్ మొదటి వారంలో జరగబోయే పోలింగ్‌తో స్పష్టమవనుంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :