Monday, 10 August 2026 12:12:51 PM

సిరిసిల్లలో ఉద్రిక్త వాతావరణం....

– కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నేతల నిరసనలు...

Date : 18 December 2025 01:27 PM Views : 439

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల పట్టణంలో రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. బిల్లింగ్ అంశం సహా పలు విషయాలపై కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య పరస్పర నిరసనలు కొనసాగడంతో పట్టణం ఒక్కసారిగా హోరెత్తింది. కాంగ్రెస్ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ నమోదు చేసిన కేసులను కోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో బీజేపీ అరాచకాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ధర్నాకు పిలుపునిచ్చింది.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో సిరిసిల్లలోని బీజేపీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించేందుకు తరలివచ్చారు. అప్పటికే బీజేపీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు ఉండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరుపక్షాల కార్యకర్తలు పోటీగా నినాదాలు చేయడంతో ప్రాంతమంతా ఉద్రిక్తత నెలకొంది. సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ కార్యాలయం వద్దకు కాంగ్రెస్ శ్రేణులు చేరుకోకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసులు బీజేపీ కార్యాలయంలో ఉన్న కార్యకర్తలను బయటకు రాకుండా నియంత్రించారు. అదే సమయంలో బీజేపీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన టెంట్‌ను పోలీసులు తొలగించారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు బైపాస్ రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుందన్న సమాచారంతో జిల్లా ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగారు. బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులను అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.పోలీసుల కఠిన చర్యల మధ్య కొంతసేపు నినాదాలు కొనసాగినప్పటికీ, చివరకు కాంగ్రెస్ శ్రేణులను అక్కడి నుంచి తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనతో సిరిసిల్ల పట్టణంలో కొంతకాలం పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :