Saturday, 18 April 2026 09:15:19 AM

ఏడుపాయలలో భక్తుల సందడి…

పుణ్యక్షేత్రంలో జన జాతర...

Date : 23 November 2025 01:55 PM Views : 258

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / : మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే దూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా ఏడుపాయల చేరుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం ఆలయ ప్రాంగణం, రహదారులు, పార్కింగ్ ప్రాంతాలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా భక్తి శ్రద్ధలతో నిండిన వాతావరణం నెలకొంది.అమ్మవారి సన్నిధిలో భక్తులు ఒడి బియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి కరుణ కోసం కుటుంబ సమేతంగా, చిన్నారులతో, వృద్ధులతో భారీగా భక్తులు ఆలయాన్ని సందర్శించారు. కార్తీక మాసం కావడంతో భక్తుల ఉత్సాహం మరింత పెరిగింది.ఈ సందర్భంగా వేద పండితులు పార్థివ్ శర్మ, రాము, నాగరాజు, రాజశేఖర్ శర్మ తదితరులు ప్రత్యేక పూజలు, శాంతి హోమాలు, వేదపఠనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఘంటానినాదాలు, మంత్రోచ్చారణలతో ఆధ్యాత్మిక వాతావరణం అలముకుంది.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాటు చేశారు. ఆలయ సిబ్బందిలో సూర్య శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి, బ్రహ్మచారి, నర్సింలు, బత్తినీ రాజు, వరుణ చారి, నరేష్ తదితరులు భక్తులకు మార్గదర్శనం, నీటి సదుపాయం, క్యూలైన్ నిర్వహణ వంటి సేవలు అందించారు.ఇక భద్రతా చర్యల్లో భాగంగా ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, రవాణా సౌకర్యాలు, అత్యవసర చర్యలు సిద్ధంగా ఉంచడంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు.ఏడుపాయల దర్శనం కోసం వచ్చిన భక్తులు ఆలయ నిర్వహణ, శుభ్రత, పూజావిధానాలు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్తీక పౌర్ణమి సమీపిస్తున్న నేపధ్యంలో రాబోయే రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :