ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హన్మకొండ జిల్లా : హన్మకొండ జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిర్థిష్టమైన పనిగంటలు లేక రాత్రింబవాళ్లు శ్రమించాల్సి వస్తోంది. పాలనపరంగా ఏ చిన్న పొరపాటు జరిగినా కార్యదర్శులే బలి అవుతున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పంచాయతీ కార్యదర్శులు పనిఒత్తిడి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడాదికాలంగా పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో అన్నీ తామై వ్యవహరిస్తున్న కార్యదర్శులకు పనిబారం పెరిగి పోతోంది. రోజువారీ విధులతో పాటు సర్వేలు, ప్రభుత్వ పథకాలకు సంబందించిన జాబితాలు సిద్ధం చేయడం తలకు మించిన భారంగా మారుతోంది. దీనికి తోడు నిధులు లేక సమస్యలు పరిష్కారం కాక, ప్రజలకు సమాధానం చెప్పలేక కార్యదర్శులు సతమాతం అవుతున్నారు. పంచాయతీ కార్యదర్శుల వ్యవస్థ సర్పంచుల పదవీకాలం ముగిసిన తర్వాత వారికష్టాలు మరింత ఎక్కువ అయ్యాయని చెప్పుకోవచ్చు. దీంతో పంచాయితీ కార్యదర్శులు పరేషాన్ అవుతున్నట్లు వారు వాపోతున్నారు. జిల్లాలో గత ఏడాది ఫిబ్రవరి ఒకటవ తేదీతో పంచాయతీల గడువు ముగిసింది. ప్రభుత్వం సర్పంచుల స్థానంలో మండల స్థాయి అధికారులను గ్రామాలకు ప్రత్యేక అధికారులుగా నియమించింది. కానీ గ్రామాలకు నిధులు లేకపోవడంతో వీధిదీపాల ఏర్పాటు పారిశుధ్యం మెరుగు, మంచినీటి సరఫరా వంటి ప్రధాన సమస్యలు పరిష్కరించేందుకు పంచాయతీ కార్యదర్శులకు ఆర్థిక భారం తప్పడం లేదు. లక్షలాది రూపాయలు అప్పులు చేసి పంచాయతీ బండిని నెట్టుకొస్తున్నారు. సమయపాలన లేకుండా ప్రభుత్వం కార్యదర్శులతో పని చేయిచుకోవడం మూలంగా వారు తమ తమ కుటుంబాలతో కనీస సమయం కూడా గడిపే వీలుకూడా లేకుండా పోతోంది. అందువల్ల వారు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.ఉదయం తొమ్మిది గంటల లోపే గ్రామపంచాయతీ చేరాలనే కఠిన నిబంధన ప్రభుత్వం విధించడంతో ఇక తప్పదు అన్న విధంగా తమ విధులకు హాజరు అవుతున్నారు. నిర్దేశిత సమయం లోగా చేరుకొని లైవ్ లొకేషన్ ద్వారా ఫోటోలు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. సమయం మించిపోతే అధికారులతో ఇబ్బందులు, మాటలు పడాల్సి వస్తుందని కనీసం అల్పాహారం కూడా సరిగా చేయకుండా హడావుడిగా, ఆగమేఘాలపై గ్రామాలకు చేరుతున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రమాదాల బారిన పడిన సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. స్మశాన వాటిక, క్రీడా ప్రాంగణం, గ్రామాల్లో మురికి కాలువల పారిశుధ్యం, రోడ్ల పరిశుభ్రత...... ఇలా చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యల్లో ఉదయం లేవగానే ఆయా పనులను పరిశీలించడంతో పాటు ఉన్నతధికారులకు ప్రస్తుత స్థితిగతులు తెలియజేయాల్సి రావడంతో ఒక నిమిషం తేడా వచ్చినా ఎక్కడ అధికారులతో దండకం వినాల్సి వస్తుందో అని బిక్కుబిక్కు మంటూ తమ విధులకు పరుగులు పెడుతున్నారు.
పని ఒత్తిడితో ఇబ్బందులు
పంచాయతీ కార్యదర్శులు పని ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. కొందరైతే అసలు ఈ ఉద్యోగానికి ఎందుకు వచ్చామా అని తలలు పట్టుకుని మధన పడుతున్నారు. గ్రామపంచాయతీ యొక్క అన్నివిధులు వీరే నిర్వర్తించాల్సి ఉండటం వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. పారిశుధ్య నిర్వహణ తో పాటు పన్నుల వసూలు వారికి మెడపై కత్తిలా వేలాడుతోంది. పన్నులు వసూలు చేయడానికి కఠిన చర్యలు తీసుకుంటే ఆయా గ్రామాల్లోని నాయకులు పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి తీసుకు వస్తున్నారు. దీంతో అటు ఉన్నత అధికారులకు సమాధానం చెప్పలేక ఇటు గ్రామాల్లోని నాయకులను ఏమి అనలేక తీవ్ర మనోవ్యధకు గురి అవుతున్నామని పలువురు కార్యదర్శులు తమ గోడు వెళ్ల బోసుకుంటున్నారు. పంచాయతీ ఖాతాల్లో డబ్బులు లేక అత్యవసర పనులకు ఖర్చులు లేక సతమాతం అవుతున్నారు. పైపుల లికేజిల మారమ్మత్తులు, పంచాయతీ ట్రాక్టర్ నెలవారీ ఇన్ స్టాల్ మెంట్లు, గ్రామాల్లో విద్యుత్ దీపాలు, వాటి బకాయిలు, ఇవన్ని నెలనెలా ఖచ్చితంగా చెల్లించాలి. ఇప్పటికే ఒక్కో గ్రామపంచాయతీ యాభై వేల నుండి రెండు లక్షల రూపాయల వరకు అప్పులు చేసి కార్యదర్శులు నెట్టుకొస్తున్నారు. పంచాయతీల భారమంతా కార్యదర్శుల పైనే పడుతోంది.ఇటీవలే సమావేశం అయిన కార్యదర్శుల యూనియన్ నాయకులు ఇకపై సొంతంగా డబ్బులు పెట్టుకోవద్దని నిర్ణయించినట్టుగా తెలిసింది. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి ఒక నిర్థిష్టమైన జాబ్ చార్ట్ అనేది ఉంటుందని, కానీ మాకు మాకు అదేదీ లేదని కార్యదర్శి ఒకరు వాపోయారు. పంచాయతీల్లో చేయాల్సిన విధులతో పాటు బయటి పనులకు కూడా వీరినే వాడుతోంది.ఈ విధానాలు చూస్తున్న కొందరు నూతన కార్యదర్శులు వీరి ఉద్యోగం ఇంత ఘోరంగా ఉంటుందా అని అశ్చర్యం మరియు ఆందోళనని వ్యక్తం చేస్తున్నారు. ఒకపని అయిపోయిన తర్వాత మరోపని, మరోపని అయిపోయాక ఇంకొకపని అంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతీ సంక్షేమ పథకంలో పంచాయతీ కార్యదర్శులను బాధ్యులు చేస్తున్నారు.దీంతో వారు చేసేదేం లేక అయిష్టంగా పథకాల విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకప్పుడు కార్యదర్శులు పంచాయతికి సంబందించిన విధులు మాత్రమే నిర్వహించారు. పన్నుల వసూలు, పంచాయతీ ఆదాయ వ్యయాల నిర్వహణ, జనన మరణాల ధ్రువీకరణ పత్రాల జారీ, ఇంటి నిర్మాణ అనుమతులు, గ్రామ పంచాయతీ తీర్మాణాలు, పారిశుధ్య నిర్వహణ ఇలాటివి ఉండేవి. ఇప్పుడు వీటికి తోడుగా అదనంగా ప్రకృతి వనాల నిర్వహణ, స్మశాన వాటిక, క్రీడా ప్రాంగణాల నిర్వహణ, తదితరాలను చూస్తున్నారు.ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులు తమ డిపార్ట్మెంటుకు సంబంధం లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగనన, రేషన్ కార్డుల సర్వే, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, భూముల సర్వే తదితర పనులకు సైతం వీరినే పురామాయిస్తున్నారు. సంక్షేమ పథకాల సర్వే నిర్వహించినపుడు వారి చేతిలో లేని విషయాలు కూడా ప్రజలు నమ్మి ఆ పథకాలు వారికి దక్కక పోతే తమనే నిందించే ప్రమాదం ఉందని కార్యదర్శులు భయపడుతున్నారు. గ్రామాల్లో తిరిగేది మేమే కాబట్టి ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందని వారు చెబుతున్నారు. పంచాయతీ కార్యదర్శులకు అదనపు పనిబారం నుండి మినహాయింపు ఇచ్చి ఒత్తిడి తగ్గించాలని ఇటీవలనే మంత్రి సీతక్కను కలిసి కోరారు. ఇప్పటికైనా తమ పని ఒత్తిడిని ప్రభుత్వం తగ్గించాలని జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు.
Admin
Aakanksha News