Wednesday, 04 February 2026 05:39:52 AM

నకిలీ హెచ్‌టీ పత్తి విత్తనాల దందాపై పోలీసుల ఉక్కుపాదం...

Date : 26 January 2026 05:59 PM Views : 61

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / : నారాయణపేట జిల్లాలో రైతులను మోసం చేస్తూ నకిలీ హెచ్‌టీ పత్తి విత్తనాలను అక్రమంగా విక్రయిస్తున్న వారిపై నారాయణపేట జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. సోమవారం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.నారాయణపేట మండలం బండగొండ గ్రామం, కొత్తపల్లి మండలం భూనీడ్ గ్రామాల్లో జిల్లా పోలీస్ టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక బృందం, స్థానిక పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి సంయుక్త దాడులు నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో సుమారు రూ. కోటి విలువైన 10 టన్నుల నకిలీ హెచ్‌టీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.కొత్తపల్లి మండలం భూనీడ్ గ్రామానికి చెందిన వి. బాలకృష్ణ నాయుడు, శశివర్ధన్ నాయుడు (తండ్రి–కొడుకు) ఇళ్ల నుంచి ఈ నకిలీ విత్తనాలను పట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు, మద్దూరు పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. బాలకృష్ణ నాయుడు గతంలో మద్దూరు, నర్వ, దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇదే తరహా నేరాలకు పాల్పడ్డట్టు విచారణలో వెల్లడైందని, ఆ కేసులన్నీ ప్రస్తుతం కోర్టుల్లో విచారణలో ఉన్నాయని ఎస్పీ వివరించారు. రైతులను మోసం చేసే నకిలీ విత్తనాల వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.రైతులు ప్యాకింగ్ లేని, అనుమానాస్పద విత్తనాలను కొనుగోలు చేయవద్దని సూచించారు. నకిలీ విత్తనాల వ్యాపారం గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు లేదా వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలని కోరారు.ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ మాట్లాడుతూ, పట్టుకున్న నకిలీ పత్తి విత్తనాలు సుమారు మూడు మండలాల్లో పంటలు వేసేంత పరిమాణంలో ఉన్నాయని తెలిపారు. రైతులు గుర్తింపు పొందిన ఫర్టిలైజర్ దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా బిల్ తీసుకోవాలని, లాట్ నెంబర్ ఉన్న విత్తనాలనే కొనుగోలు చేయాలని సూచించారు.ఈ కేసును విజయవంతంగా ఛేదించిన ప్రత్యేక పోలీసు బృందం, వ్యవసాయ శాఖ అధికారులను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ అభినందించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :