Sunday, 10 May 2026 08:13:46 AM

ఓదెలలోని ఇందుర్తి పాఠశాలలో తాగుబోతుల ఇష్టరాజ్యం… విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకం...!

భద్రత కోణంలో తీవ్ర లోపం – కాంపౌండ్ అవసరం.... శిధిల భవనంలో చదువుకునే పిల్లలు – తల్లిదండ్రుల భయం...

Date : 12 July 2025 07:24 AM Views : 504

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / ఓదెల(పెద్దపల్లి జిల్లా) : ఓదెల మండలంలోని ఇందుర్తి గ్రామంలో ఉన్న మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణం ఇప్పుడు తాగుబోతుల ఆటవికానికి అడ్డాగా మారింది. బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల ఆవరణలోకి చొరబడి మద్యం సేవించి అక్కడే ఖాళీ సీసాలు, సిగరెట్లు, తినుబండారాలు వదిలేసి వెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.ఉదయాన్నే పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆ దృశ్యాలను చూసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘చదువు నేర్పే పుణ్యక్షేత్రమైన పాఠశాల ఇలా చెడ్డ వ్యసనాల వేదికగా మారడం దురదృష్టకరం అని పలువురు పేర్కొంటున్నారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులు. వారి భవిష్యత్తును భద్రంగా కాపాడే బాధ్యత సమాజానిదే అని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పాఠశాల చుట్టూ కాంపౌండ్ వాల్ లేక పోవడంతో రాత్రివేళల్లో ఎవరైనా స్వేచ్ఛగా ప్రవేశించగలగడం, చీకట్లో ఇష్టారాజ్యంగా కోనసాగించగలగడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఉపాధ్యాయులు అధికారులను వేడుకుంటూ వెంటనే పాఠశాల చుట్టూ గోడ కట్టించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు పాఠశాల భవనం పూర్తిగా శిధిలంగా మారిందని, వర్షాకాలంలో ఎప్పుడైనా కూలిపోవచ్చన్న భయం తల్లిదండ్రులను వెంటాడుతోందని మేమే చదివిన పాఠశాలలో ఇప్పుడు మా పిల్లల్ని చదివిస్తున్నాం. కానీ భవనం చాలా ప్రమాదకరంగా ఉంది. భద్రతా ప్రమాణాలు లేవు. ఆందోళన చెందుతున్నాం అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటె పిల్లలకు స్కూల్ చేరుకోవడమే ఓ సవాల్ గా మారుతుంది.పాఠశాల గ్రామానికి దూరంగా ఉండడం, ప్రధాన రహదారి వెంట వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల చిన్నారులు స్కూల్ కు చేరడంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రధానోపాధ్యాయుడు తాత్కాలికంగా వాహన ఏర్పాట్లు చేసినా, ఆర్థిక భారంగా మారుతుందని తల్లిదండ్రులు పేర్కొన్నారు.

కార్పొరేట్ స్థాయి వసతుల కోసం వినతులు...

విద్యార్థుల కోసం మరింత తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, ఆట మైదానం, అవసరమైన ఫర్నిచర్‌ లాంటి మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉంది. ‘‘ఇందుర్తి పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దాలి. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది. పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా చూడాలి,’’ అని గ్రామ యువతలోని తోకల మహేందర్ యాదవ్, పూసల తిరుపతి, గోపాగోని గణేష్ గౌడ్, తిప్పని శ్రీకాంత్ గౌడ్, దొడ్డే సతీష్, దామెర రాజు, తిప్పరపు కృష్ణ, పోతుగంటి కళ్యాణ్ తదితరులు కోరుతున్నారు.

అధికారుల తక్షణ స్పందన అవసరం...

ఈ పరిణామాల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు, మండల స్థాయి బాధ్యత వహించే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి. ఒక చిన్నారి కూడా ప్రమాదంలో పడకూడదన్న దృష్టితో, భద్రతా ఏర్పాట్లు, మౌలిక వసతుల కల్పన దిశగా వేగంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాఠశాలల పట్ల ప్రజల్లో భరోసా పెరిగేందుకు ఇది కీలక అవకాశమని విద్యాభిమానులు అభిప్రాయపడుతున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :