Wednesday, 04 February 2026 05:40:17 AM

మొక్కులు తీర్చే అమ్మగా ఏడుపాయల దుర్గమ్మకు అపార ఖ్యాతి...తరతరాల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన మెదక్ జిల్లా శక్తిపీఠం...

సర్పదోష నివారణకు ప్రసిద్ధ క్షేత్రం…మెదక్ జిల్లా నాగసానిపల్లి... ఏడుపాయల దుర్గమ్మ ఆలయ చరిత్రపై "తొలి ఆకాంక్ష" ప్రత్యేక కథనం...

Date : 17 January 2026 10:39 AM Views : 193

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / మేదక్ జిల్లా : ఏడుపాయల దుర్గమ్మ ఆలయ చరిత్రకు పురాణ కాలంతోనే ఆరంభమైందని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్షేత్రం ద్వాపర యుగాంతానికి చెందిన ఘట్టాలతో ముడిపడి ఉండటం దీనికి అపూర్వమైన ప్రాశస్త్యాన్ని తెచ్చిపెట్టింది. మహాభారత కాలానంతరం పరీక్షిత్తుu మహారాజు సర్పరాజు తక్షకుని కాటుతో మరణించడంతో, ఆయన కుమారుడు జనమేజయుడు తీవ్ర శోకంలో మునిగి పోయాడని పురాతన కథనం. తండ్రి మరణానికి కారణమైన సర్పజాతిని సమూలంగా అంతమొందించాలనే ఉద్దేశంతో జనమేజయుడు మహాసర్పయాగాన్ని తలపెట్టాడు.ఈ సర్పయాగాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అప్పటి మహర్షులైన జమదగ్ని, అత్రి, కశ్యపి, విశ్వామిత్ర, వశిష్ట, గౌతమి, భరద్వాజ వంటి సప్త రుషులను ఆహ్వానించాడు. వీరి ఆధ్వర్యంలో యజ్ఞ గుండాలు నిర్మించి, సర్పయాగాన్ని ప్రారంభించారు. యాగ ప్రభావంతో సర్పాలన్నీ యజ్ఞ గుండాలలోకి వచ్చి అగ్నికి ఆహుతవుతుండటంతో సర్పజాతి పూర్తిగా అంతరించిపోతుందనే భయం పాతాళ లోకంలో నెలకొంది.ఆ సమయంలో నాగులతల్లి దేవతలను ప్రార్థించిందని,నాగజాతిని కాపాడాలని వేడుకుందని పురాణ గాథ చెబుతుంది. నాగులకు పుణ్యలోక గతులు కలిగించేందుకు గరుత్మంతుడు పాతాళ లోకంలోని భోగవతీ నదిని భూమిపైకి తీసుకువచ్చాడని కథనం. ఆ నది యజ్ఞస్థలికి చేరుకున్న వేళ అద్భుత సంఘటన చోటుచేసుకుందని భక్తుల విశ్వాసం. భోగవతీ నది ఒక్కసారిగా ఏడుపాయలుగా చీలి ప్రవహించిందని, ఆ ఏడుపాయలు యజ్ఞ గుండాలను ముంచెత్తడంతో సర్పయాగం నిలిచి పోయిందని చెబుతారు.ఆ ఏడుపాయలలో ఒక పాయ రాతిగుహలో వెలసిన దుర్గామాత పాదాలను తాకుతూ ప్రవహించి, ఆపై గోదావరి నదిలో కలిసిందని స్థలపురాణం వివరిస్తుంది. ఈ సంఘటనతో ఆ ప్రాంతం పవిత్రమైందని, సర్పయాగ స్థలం దుర్గామాత నివాసంగా మారిందని భక్తులు నమ్ముతారు. ఏడుగురు రుషులు పాల్గొన్న యాగం, నది ఏడుపాయలుగా విభజించబడిన సంఘటనల కారణంగా ఈ క్షేత్రానికి “ఏడుపాయలు” అనే పేరు స్థిరపడింది. అప్పటి నుంచి అమ్మవారు “ఏడుపాయల దుర్గామాత”గా పూజలందుకుంటున్నారు.కాలక్రమంలో ఈ ప్రాంతం వన ప్రాంతంగా ఉండగా, దుర్గామాత స్వయంభూగా వెలసిందనే నమ్మకం ఏర్పడింది. నల్లసరపు రాతితో చెక్కినట్లుగా కనిపించే అమ్మవారి రూపం సహజ సిద్ధమైనదిగా భావిస్తారు. రాతి గుహలో వెలిసిన అమ్మవారి పాదాలే ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సర్పదోష నివారణ, సంతాన లాభం, రోగ నివారణ కోసం ఇక్కడ పూజలు చేస్తే ఫలితం దక్కుతుందనే విశ్వాసం తరతరాలుగా కొనసాగుతోంది. కాలానుగుణంగా స్థానికులు, రాజులు, భక్తులు ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డారని చరిత్ర చెబుతుంది. గ్రామస్తుల సంరక్షణలోనే ఈ క్షేత్రం తరతరాలుగా నిలిచింది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే జాతరతో ఈ ఆలయ ఖ్యాతి మరింత విస్తరించింది. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఏడుపాయల దుర్గమ్మ ఆలయాన్ని తెలంగాణలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో ఒక విశిష్ట శక్తి క్షేత్రంగా నిలిపింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామ పరిధిలో ఏడుపాయల నది ఒడ్డున వెలసిన ఏడుపాయల దుర్గమ్మ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రాచీనమైన, పవిత్రమైన శక్తిపీఠాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. వందల ఏళ్ల చరిత్ర,పురాణ ప్రాశస్త్యం, భక్తుల అచంచల విశ్వాసంతో ఈ ఆలయం నేటికీ వేలాది మందిని ఆకర్షిస్తోంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చే ప్రధాన పుణ్యక్షేత్రంగా ఏడుపాయల దుర్గమ్మ పేరు మార్మోగుతోంది.ఈ ఆలయానికి ద్వాపర యుగాంతంతో ముడిపడిన పురాణ గాథ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే ఏడుపాయల జాతర ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణగా నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. జాతరకు లక్షలాది భక్తులు తరలివస్తారు. భక్తులు ముందుగా మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, ఆపై అమ్మవారి దర్శనానికి వచ్చి భక్తులు ప్రత్యేక వ్రతాలు, దీపారాధనలు చేస్తుంటారు. మరికొందరు సంతానప్రాప్తి కోసం, వివాహ ఆటంకాలు తొలగాలని, కుటుంబ శాంతి కలగాలని మొక్కులు మొక్కుతారు.మొక్కులు నెరవేరిన తర్వాత తిరిగి వచ్చి అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకోవడం ఇక్కడ సాధారణంగా కనిపించే దృశ్యం.స్థానిక గ్రామస్తులు కూడా అమ్మవారిని గ్రామ దేవతగా భావిస్తూ, ఏ ఆపద వచ్చినా ముందుగా ఏడుపాయల దుర్గమ్మను ప్రార్థిస్తారు. వర్షాభావం, వ్యాధులు, ఇతర సమస్యల సమయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. అమ్మవారి కృపతో గ్రామానికి ఎలాంటి పెద్ద అపదలు రాలేదన్న విశ్వాసం గ్రామస్తుల్లో బలంగా ఉంది.దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ విశ్వాసాన్ని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏడుపాయల జాతరను అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరగడం వల్ల భక్తులకు మరింత సౌకర్యాలు కలుగుతున్నాయి. అయినప్పటికీ అమ్మవారి శక్తి, కృపలపైనే భక్తుల విశ్వాసం నిలిచిందని స్థానికులు అంటున్నారు.ఆధ్యాత్మికత, పురాణ విశ్వాసం, భక్తుల అనుభవాల సమ్మేళనంగా ఏడుపాయల దుర్గమ్మ ఆలయం నిలుస్తోంది. తరతరాలుగా కొనసాగుతున్న ఈ నమ్మకమే ఈ క్షేత్రానికి అసలైన బలం అని, భవిష్యత్తులోనూ ఇదే విశ్వాసంతో అమ్మవారి మహిమ మరింత వ్యాప్తి చెందుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.జాతర రోజుల్లో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు భక్తజన సంద్రంగా మారిపోతాయి. వ్రతాలు, మొక్కులు, ప్రత్యేక పూజలు, దీపారాధనలు ఘనంగా నిర్వహిస్తారు.దశాబ్దాల తరబడి నిరాటంకంగా జరుగుతున్న ఈ జాతర ప్రాముఖ్యతను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఏడుపాయల జాతరను అధికారిక రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించి నిర్వహిస్తోంది. భక్తుల సంఖ్య, ఆలయ ప్రాశస్త్యం, చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. 2023 సంవత్సరంలో జాతర నిర్వహణకు, భక్తులకు తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం,విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పన కోసం రూ. రెండు కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేయడం విశేషం.నేడు ఏడుపాయల దుర్గమ్మ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా, తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా కూడా ఎదుగుతోంది. పురాతన చరిత్ర, ప్రకృతి అందాలు, నదీ తీర వాతావరణం కలగలిసి ఈ క్షేత్రాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.భక్తుల విశ్వాసం, తరతరాల సంప్రదాయం, ప్రభుత్వ సహకారంతో ఏడుపాయల వనదుర్గామాత క్షేత్రం భవిష్యత్తులో మరింత వైభవంగా వెలుగొందనుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పాపన్నపేట రిపోర్టర్ సత్యనారాయణ

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :