Sunday, 19 July 2026 09:25:18 PM

డిగ్రీ ప్రాక్టికల్ పరీక్షల బహిష్కరణ....?

ప్రశ్నార్ధకంగా విద్యార్థుల భవిష్యత్...?

Date : 01 April 2025 05:41 PM Views : 467

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / నల్లగొండ జిల్లా : ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో వేలమంది విద్యార్థులు భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతుందా... అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. పెండింగ్ ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించాలని డిమాండ్ చేస్తూ గత కొంత కాలంగా ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు ఆందోళన చేసిన విషయం విదితమే.. అయితే ఇప్పుడు ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంట‌నే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 2 నుంచి జ‌రిగే డిగ్రీ సెమిస్ట‌ర్ ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌ల‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు తెలంగాణ అఫ్లియేటెడ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల మేనేజ్‌మెంట్ ఎంజీయూ చాప్టర్ అధ్యక్షుడు, నీలగిరి విద్యాసంస్థల ప్రిన్సిపాల్ మారం నాగేందర్ రెడ్డి తెలిపారు. న‌ల్ల‌గొండ జిల్లా కేంద్రంలోని నీల‌గిరి డిగ్రీ అండ్ పీజీ క‌ళాశాల‌ల ఎదుట మంగ‌ళ‌వారం ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేసి నిర‌స‌న తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గతేడాది అక్టోబర్ నుంచి దశలవారీగా తెలంగాణ అఫ్లియేటెడ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల మేనేజ్‌మెంట్ ఆందోళన చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.గత నెల 16న ఎంజీయూ వీసీకి, 23న నల్ల‌గొండ ఆర్డీఓకు వేర్వేరుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని, లేని పక్షంలో త్వరలో జరగబోయే ప్రాక్టికల్ థియరీ పరీక్షలను బహిష్కరిస్తామని వినతి పత్రాలను అంద‌జేసిన‌ట్లు అయన తెలిపారు. ఇదే విషయంపై ప్రభుత్వం స్పందించక పోవడంతో ఏప్రిల్ 2 నుంచి జరిగే డిగ్రీ సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు ఆయ‌న తెలిపారు. ప్రభుత్వం ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్, ఉపకార వేతనాలు విడుదల చేయకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు గత నాలుగు సంవత్సరాలుగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన‌ట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిర్ణయానికి యాజమాన్యాలు సిద్ధమైన‌ట్లు వెల్ల‌డించారు. విద్యార్థుల నుంచి ఒక్క‌ రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా నాలుగేళ్లుగా విద్య అందిస్తున్న‌ట్లు చెప్పారు. దీంతో అధ్యాపకుల జీతాలు, భవనాల రెట్లు, కరెంట్‌ బిల్లులు, మున్సిపల్ ట్యాక్స్‌లు, యూనివర్సిటీ వివిధ ఫీజులను అప్పులు చేసి చెల్లించిన‌ట్లు తెలిపారు. ఇప్పటికే లక్షల రూపాయల అప్పులు అయ్యాయని, ఇక అప్పుచేసి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేక‌పోవ‌డంతోనే చేసేదేమి లేక ఈ నిర్ణయానికి వచ్చిన‌ట్లు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :