Saturday, 26 September 2026 06:58:29 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కలకలం... హంసిని డీజీ హై స్కూల్ ప్రిన్సిపాల్ ఉన్మాదం...

10వ తరగతి విద్యార్థుల చేతులు విరగొట్టిన ప్రిన్సిపాల్... గాయాలతో ఆసుపత్రిలో విద్యార్థులు.. ఆగ్రహంలో తల్లిదండ్రులు..

Date : 19 December 2025 06:14 AM Views : 407

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని హంసిని డీజీ హై స్కూల్‌లో చదువుతున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థులపై అదే పాఠశాల ప్రిన్సిపాల్ దారుణంగా దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. పాఠశాలకు కొన్ని రోజులుగా హాజరు కాలేదన్న కారణంతో, మాథ్స్ నోట్స్ పూర్తిగా రాయలేదన్న నెపంతో ప్రిన్సిపాల్ నరాల సంతోష్ విద్యార్థులను తీవ్రంగా కొట్టాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో ఒక విద్యార్థి చేయి విరగగా, మరో విద్యార్థికి చేతివేలు విరిగినట్లు సమాచారం.బాధితుల వివరాల ప్రకారం వేములవాడ పట్టణానికి చెందిన సాయి, అయాన్ అనే ఇద్దరు విద్యార్థులు హంసిని డీజీ హై స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నారు. అయాన్ తల్లి అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకోవాల్సి రావడంతో, తండ్రి ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లిన కారణంగా ఇంటి బాధ్యతలు అయాన్‌పైనే పడినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సుమారు 15 రోజుల పాటు తల్లిని చూసుకునేందుకు స్కూల్‌కు రాలేకపోయినట్లు అయాన్ వివరించాడు.అనంతరం పాఠశాలకు హాజరైన రోజు తన పరిస్థితిని ప్రిన్సిపాల్‌కు వివరించి, క్లాస్‌కు వెళ్లేందుకు అనుమతి కూడా తీసుకున్నట్లు విద్యార్థి తెలిపాడు.అయితే అనుమతి ఇచ్చినప్పటికీ, మాథ్స్ నోట్స్ పూర్తిగా రాయలేదన్న కారణాన్ని ముందుకు తెచ్చి ప్రిన్సిపాల్ తీవ్రంగా ఆగ్రహానికి లోనయ్యాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో అయాన్‌తో పాటు మరో విద్యార్థి సాయిని కూడా తరగతి గదిలోనే దారుణంగా కొట్టినట్లు తెలిపారు. కొట్టుడులో అయాన్ చేయి విరిగిపోయిందని, సాయి చేతివేలు విరిగిందని బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటన వెలుగులోకి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులపై శారీరక దాడికి పాల్పడిన ప్రిన్సిపాల్‌పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల అనేది విద్యాబోధనతో పాటు భద్రత, మానవీయ విలువలు నేర్పే స్థలం కావాలని, కానీ ఇలాంటి ఘటనలు విద్యావ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల తల్లిదండ్రులు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు, ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన వారిని ఉపేక్షించకూడదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారుల స్పందన కోసం స్థానికంగా ఉత్కంఠ నెలకొంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :