Monday, 10 August 2026 12:04:37 PM

దుమ్ము రేగుతోంది.. దమ్ము తీస్తోంది.. వేములవాడలో నరకప్రాయంగా ప్రయాణం..రోడ్డు తవ్వి వదిలేశారు..

అధికారుల నిర్లక్ష్యం..వ్యాపారుల విలవిల.. పట్టించుకునే వారే లేరా? ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు, ప్రజలు...

Date : 19 December 2025 11:26 AM Views : 887

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / రాజన్న సిరిసిల్ల జిల్లా : కనిపించని శత్రువులా దుమ్ము ప్రజలపై దాడి చేస్తోంది. శ్వాస తీసుకోవడమే కష్టంగా మారింది. వేములవాడ పట్టణంలో నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన రహదారి ఇప్పుడు ప్రజలకు నరకప్రాయంగా మారింది. కోరుట్ల రోడ్డు నుంచి చెక్కపల్లి రోడ్డు వరకు సుమారు 600 మీటర్ల మేర చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులు అర్థాంతరంగా నిలిచి పోవడంతో ప్రజల సహనం నశిస్తోంది.గత నవంబర్ నెలలో అట్టహాసంగా ప్రారంభించిన రోడ్డు పనులు ఆదిలోనే హంసపాదులా మారాయి. రోడ్డుకు ఇరువైపులా మట్టిని తొలగించిన గుత్తేదారు, ఆ తర్వాత పనులను పూర్తిగా వదిలేయడంతో రహదారి అంతా మట్టిగుట్టలతో నిండిపోయింది. మట్టి తొలగింపు సమయంలో మిషన్ భగీరథ పైపులైన్లు ధ్వంసం కావడంతో స్థానికులు నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి పైపులైన్లకు మరమ్మతులు చేయించినప్పటికీ, అసలు రోడ్డు పనులు మాత్రం అడుగు ముందుకు పడలేదు.ప్రధాన రహదారి కావడంతో రోజంతా వాహనాల రాకపోకలు కొనసాగుతుంటాయి. మట్టి అలాగే వదిలేయడంతో వాహనాలు వెళ్లిన ప్రతిసారి విపరీతంగా దుమ్ము రేగుతోంది. దుకాణాల్లోని సరుకులన్నీ దుమ్ముతో కప్పబడిపోతున్నాయి. దీంతో వ్యాపారాలు సాగక వ్యాపారులు ఆర్థిక నష్టాల పాలవుతున్నారు. ద్విచక్ర వాహనదారులకు కళ్లలో దుమ్ము పడి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం దుమ్ము పీల్చడం వల్ల చిన్నారులు, వృద్ధులు, మహిళలు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. నవంబర్‌లో ప్రారంభమైన పనులు డిసెంబర్ సగం దాటినా పూర్తి కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని పట్టణవాసులు విమర్శిస్తున్నారు. వేములవాడ పుణ్యక్షేత్రానికి నిత్యం భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు. అలాంటి పట్టణంలో ప్రధాన రహదారిని ఈ విధంగా నిర్లక్ష్యం చేయడం తగదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత కాంట్రాక్టర్, అధికారులు వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని, దుమ్ము బాధల నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని ప్రయాణికులు, స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :