Wednesday, 04 February 2026 05:41:04 AM

రామగుండంలో అయోమయం, భయాలు, కుమ్మక్కు అనుమానాలు...

– ప్రజాస్వామ్యానికి సవాల్‌గా మారిన రాజకీయ పరిణామాలు...

Date : 03 February 2026 11:35 PM Views : 60

ఆకాంక్ష న్యూస్ - చిన్న ప్రత్యేక ప్రతినిధి / : పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు ఈ నెల 11న జరగనున్న నేపథ్యంలో ఇక్కడి రాజకీయ వాతావరణం రోజురోజుకూ మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఒకనాడు ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా, కార్మిక ఉద్యమాల ఖిల్లాగా పేరుగాంచిన రామగుండం నేడు ఎన్నికల వేళ అయోమయానికి కేంద్రంగా మారిందన్న భావన ప్రజల్లో బలంగా వ్యక్తమవుతోంది. అసలు అభ్యర్థులు ఎవరు, ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు, ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి ఎందుకు మారుతున్నారు అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకకపోవడం ప్రజలను ఆలోచనలో పడేస్తోంది. రామగుండం అంటే కేవలం ఒక ప్రాంతం మాత్రమే కాదు. కార్మిక ఉద్యమాలకు పునాదిరాయి, పోరాటాలకు చిరునామా. ఇలాంటి ప్రాంతంలో ఎన్నికలు అంటే ఉత్సాహం, రాజకీయ చర్చలు, సిద్ధాంతాల పోటీ ఉండాలి. కానీ ఈసారి కార్పొరేషన్ ఎన్నికల్లో కనిపిస్తున్న దృశ్యాలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నాయని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరు ఎవరిని భయపెడుతున్నారు? ఎవరు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? ఏ పార్టీ అభ్యర్థులు ఎందుకు అకస్మాత్తుగా మరో పార్టీలోకి వెళ్లిపోతున్నారు? అనే ప్రశ్నలు జవాబు లేని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి.మాజీ నాయకులు, ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న నేతలందరూ ఒకటే అన్న అనుమానం ప్రజల్లో కలుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు అంటే ప్రజాస్వామ్యానికి పండుగ లాంటివి. ప్రజలు తమ ప్రతినిధులను స్వేచ్ఛగా ఎన్నుకునే అవకాశం. కానీ రామగుండంలో ఆ స్వేచ్ఛకు అడ్డు పడుతున్న పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? అన్న సందేహం ప్రజలను కలవరపెడుతోంది. గెలుపు ఓటమిని క్రీడా స్ఫూర్తితో స్వీకరించాల్సిన రాజకీయాలు, ఇక్కడ మాత్రం భయభ్రాంతులు, బెదిరింపులు, అనుమానాల మధ్య నడుస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.తెలంగాణ రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా రామగుండం నియోజక వర్గంలోనే ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయన్నది మరో ప్రశ్న. ఒక పార్టీ కార్పొరేట్ అభ్యర్థులు మరో పార్టీలోకి, అక్కడి అభ్యర్థులు ఇంకొక పార్టీలోకి మారడం వెనుక ఏం జరుగుతోంది? ఇది రాజకీయ కుమ్మక్కా, లేక ఎవరికో తెలియని ఒత్తిళ్ల ఫలితమా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎన్నికల అనంతరం ఎదుర్కోవాల్సిన రాజకీయ పరిణామాలను ఎన్నికల ముందే భయంగా చూపిస్తూ అభ్యర్థులను పార్టీలు మార్చించడమేంటి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.రామగుండం మామూలు ప్రాంతం కాదు. పోరాటాల గడ్డ, కార్మిక స్ఫూర్తికి ప్రతీక. అలాంటి ప్రాంతంలో ఈ విధమైన చిత్ర విచిత్ర రాజకీయాలు చోటు చేసుకోవడం ప్రజలకు మింగుడు పడటం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎవరు ఎవరికి అమ్ముడుపోతున్నారు? ఎవరు ఎవరిని కొనుగోలు చేస్తున్నారు? అన్న అనుమానాలు రాజకీయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఇక ప్రధాన పార్టీలకు దీటుగా పలు పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు కూడా రంగంలో ఉండటం ఎన్నికల పోటీని మరింత ఆసక్తికరంగా మార్చింది. కొన్ని ప్రధాన పార్టీలు మేమే గెలుస్తామన్న ధీమాతో ముందుకు సాగుతున్నా, లోపల ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు మాత్రం ఈసారి చిత్ర విచిత్ర పరిణామాలకు వేదికగా మారాయని చెప్పడంలో అతిశయోక్తి లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ నెల 11 వరకు ఈ రాజకీయ గందరగోళం ఏ మలుపు తిరుగుతుందో, ప్రజాస్వామ్య విలువలు నిలబడతాయా లేక అనుమానాలే మిగులుతాయా అన్నది వేచి చూడాల్సిందే. పోరాటాల ఖిల్లా రామగుండం మరోసారి తన ప్రజాస్వామ్య చైతన్యాన్ని చాటుతుందా, లేక ఈ అయోమయం మరింత పెరుగుతుందా అన్న దానిపై ప్రజలంతా వెయ్యి కన్నులతో ఎదురుచూస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :