ఆకాంక్ష న్యూస్ - ఇంటర్నేషనల్ వార్తలు / ఆకాంక్ష డెస్క్ : “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” ర్యాలీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిఇది ఎన్నికల ర్యాలీ కాదు.. ఇది ఒక యుద్ధం’ అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని నిర్వచించిన ఆయన, ఆ పార్టీని ఎదుర్కొనేందుకు రాహుల్ గాంధీ నిలబడ్డారని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ గాంధీతో కలిసి మనం పోరాటం చేస్తున్నామంటూ మధ్యప్రదేశ్ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. సోమవారం ఆయన ఇండోర్ లో జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల యుద్ధం రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడేవారికి, రాజ్యాంగాన్ని మార్చాలనుకునేవారికి మధ్య జరుగుతోందని సీఎం రేవంత్ అన్నారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ముందుగానే గుర్తించి రాజ్యాంగ పరిరక్షణకు పోరాడుతున్నారని వెల్లడించారు. “గజనీ మహమ్మద్ హిందుస్తాన్ ను దోచుకోవడానికి ప్రయత్నించినట్లు, రాజ్యాంగాన్ని మార్చాలని మోదీ ప్రయత్నిస్తున్నారు.. కానీ ఆయన ప్రయత్నం ఫలించడం లేదు. ఎందుకంటే ఆనాడు బ్రిటిషర్ల నుంచి మహాత్మా గాంధీ దేశాన్ని రక్షించినట్లు.. భారతీయ జనతాపార్టీ పేరుతో చలామని అవుతున్న బ్రిటిష్ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు రాహుల్ గాంధీ పోరాడుతున్నారు. ఈ యుద్ధంలో మనమంతా రాహుల్ గాంధీతో కలసి నడవాలి” అని సీఎం ఇండోర్ ప్రజలకు పిలుపునిచ్చారు.ఇది రెండు పరివార్ ల మధ్య జరుగుతున్నయుద్ధం అన్న సీఎం… ఒకటి గాంధీ పరివార్ అయితే మరొకటి గాడ్సే పరివార్ అని బీజేపీని ఉద్దేశించి విమర్శించారు. గాడ్సే పరివార్ వైపు నుంచి మోదీ… గాంధీ పరివార్ వైపు నుంచి రాహుల్ గాంధీ పోరాడుతున్నారని చెప్పారు. అందుకే మనమంతా గాంధీ పరివార్ గా రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవాలి అని ఓటర్లను కోరారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అని సీఎం రేవంత్ సూచించారు.
Admin
Aakanksha News