ఆకాంక్ష న్యూస్ - ఇంటర్నేషనల్ వార్తలు / అంతర్జాతీయం : పదేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరిగి, కొత్త ప్రభుత్వం ఏర్పడుతోంది. నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి అధికార పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయం కాగా, చిన్న పార్టీలకు మాత్రం ఈ ఎన్నికల్లో గ్రహణం పట్టింది. ఈ పార్టీలు కూడా ఇటీవల వరకూ వార్తల్లో ప్రముఖంగానే ఉన్నప్పటికీ ఫలితాలు మాత్రం ఆ పార్టీలకు మొండిచేయి చూపించాయి.ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల నాటికి నిషేధిత 'జమాత్-ఇ-ఇస్లా్మి' ఎన్నికల ప్రక్రియలోకి అడుగుపెట్టింది. దశబ్దాలుగా ఎన్నికలను బహిష్కరిస్తూ వచ్చిన జమాతే ఈసారి ఎన్నికల్లో తనదైన ముద్ర వేసుకుంటుందని అంతా అంచనా వేశారు. ఇంజనీర్ రషీద్‌కు చెందిన అవామీ ఇత్తెహాద్ పార్టీ అనూహ్యంగా జమాత్‌తో వ్యూహాత్మక పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాను ఇంజనీర్ రషీద్ ఓడించడంతో అంచనాలు కూడా ఎక్కువయ్యాయి. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో జమాత్ మద్దతుతో 10 మంది అభ్యర్థులు రంగంలోకి దిగారు. అయితే వారిలో కొంత మంది ఆ తర్వాత నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. జమాత్ మద్దతుతో దిగిన అభ్యర్థులంతా ఎన్నికల ఫలితాల కౌటింగ్‌లో తమ తమ నియోజవర్గాల్లో వెనకబడ్డారు.లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించిన ఇంజనీర్ రషీద్ 'మార్క్' ఎక్కడా అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించకపోవడం మరో విశేషం. ఆయన పార్టీ మద్దతిచ్చిన ఒకే ఒక అభ్యర్థి, అదికూడా ఇంజనీర్ రషీద్ తనయుడు ఖుర్షీద్ అహ్మద్ షేక్ మధ్యాహ్నం మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. పీడీపీ అభ్యర్థి ఆ తర్వాత రౌండ్లలో పుంజుకున్నారు.
ఆజాద్‌కు చుక్కెదురు....
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కేంద్రంలో కీలక పదవులు నిర్వహించిన గులాం నబీ ఆజాద్ 2022లో ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుని సొంతంగా 'డెమోక్రటిక్ ప్రొగ్రసివ్ ఆజాద్ పార్టీ'ని స్థాపించారు. ఆయన పార్టీ సైతం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ వెనకబడింది. లోక్‌సభ ఎన్నికల్లో ఆజాద్ పార్టీ మూడు స్థానాలకు పోటీ చేసి ఆ మూడింట్లోనూ ఓటమి చవిచూసింది. ఆ తర్వాత చాలా మంది నేతలు పార్టీని వీడారు.
Admin
Aakanksha News