Friday, 21 March 2025 09:45:35 AM

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం...

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం...

Date : 07 December 2024 08:11 PM Views : 166

ఆకాంక్ష న్యూస్ - ఇంటర్నేషనల్ వార్తలు / ఆకాంక్ష డెస్క్ : ఫెంగల్ తుపాను ప్రభావం తగ్గక ముందే.. భారత వాతావరణ కేంద్రం షాకింగ్ ప్రకటన విడుదల చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు ప్రకటించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వరుసగా మూడు రోజుల పాటు వర్షాలు పడుతాయని ఐడీఎం ప్రకటించింది. ఇప్పటికే ఫెంగల్ తుపాను ధాటికి తమిళనాడు అతలాకుతలం అయ్యింది. ఇప్పుడు మరో అల్పపీడనం అని ప్రకటించడంతో.. అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఫెంగల్ ప్రభావం ఏపీ, తెలంగాణపై పెద్దగా లేకపోయినా.. తాజా అల్పపీడన ప్రభావం ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు.

ఇదీ పరిస్థితి.....భారీగా పెరిగిన చలి తీవ్రత..

వాతావరణ శాఖ అధికారుల ప్రకారం.. ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తుల్లో ఉపరితల ఆవర్తనం ఆవహించింది ఉంది. దీని కారణంగా దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ డిసెంబర్ 12వ తేదీ నాటికి వాయుగుండగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో.. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, యానాం భారీ ఈదురు గాలులు వీస్తాయి. అలాగే.. దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.ఇప్పటికే రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయింది. ఆయా చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. శనివారం నాడు పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలాఉంటే.. రానున్న రెండు రోజుల్లో అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, పల్నాడు, ఎన్టీఆర్, ప్రకాశం, పశ్చిమ గోదావరి, నెల్లూరు, చిత్తూరు, జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది...తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత భారీగా పెరిగింది. వాతావరణం చల్లగా మారింది. ఆకాశం మేఘాలతో నిండిపోయింది. దక్షిణ, నైరుతి దిశగా వీస్తున్న గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు మరింత కనిష్టానికి పడిపోతున్నాయి. తెలంగాణలో నిర్మల్, ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, హైదరాబాద్, వికారాబాద్ సహా మరికొన్ని జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉంది. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది

తెలంగాణలోనూ భారీ వర్షాలు..

అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. వాతావరణం చాలా చల్లగా ఉంది. హైదరాబాద్‌లో పలు చోట్ల చిరు జల్లులు కురిశాయి. రానున్న రెండు రోజుల్లో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :