ఆకాంక్ష న్యూస్ - కరీంనగర్ జిల్లా / : దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్మిక సంఘాల నిరసనలలో భాగంగా, చిగురుమామిడి మండల కేంద్రంలో ఆశా వర్కర్లు వినూత్నంగా భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆశా వర్కర్స్ యూనియన్ సభ్యులు బస్టాండ్ ప్రాంతంలో ప్రజల ముందు భిక్షాటన చేస్తూ వినూత్న నిరసనకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ, “మా వేతనాలు అత్యంత తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ సేవల్లో పని చేస్తున్నా, మాకు కనీస ఉద్యోగ హోదా లేదు. మూడవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ఆహార భద్రత వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలని” వారు డిమాండ్ చేశారు.అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తున్నాయని, వాటిని వెంటనే రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడాన్ని తక్షణమే నిలిపివేయాలని, ఆశా వర్కర్ల వేతనాలను గణనీయంగా పెంచాలని ప్రభుత్వాన్ని ఆహ్వానించారు.ప్రభుత్వ హామీలు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, తమ హక్కుల కోసం నిరంతరంగా పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.ఈ వినూత్న భిక్షాటన నిరసన చిగురుమామిడి మండలంలో ఆసక్తికరంగా మారింది. ప్రజలు ఆశా వర్కర్ల పోరాటాన్ని గమనించి సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మారేళ్ల శ్రీలత, బెజ్జంకి సరోజన, బండారు సరోజన, పుష్ప, అంజలి, కవిత, తార, శ్వేత, సాహిదా బేగం, మంజుల, తిరుమల తదితర ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Aakanksha News